గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 23, 2016

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

Srinivas

తెలంగాణలో బీడీ పరిశ్రమ ప్రధానమైన కుటీర పరిశ్రమలలో ఒకటి. దశాబ్దాలుగా లక్షలాది మంది ఈ వృత్తి ని జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నారు. ఈ పరిశ్రమలో అధిక శాతం మహిళలే భాగస్వాములు. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో బీడీలు తయారుచేయడం కుటీరపరిశ్రమగా నడుస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలలో ఇది నమ్మకమైన ఆదాయ సముపార్జన మార్గంగా ఉన్నది. కరువు కాలాల్లో నిరుపేద కుటుంబాలకు జీవనోపాధినిస్తున్న ఏకైక ఆదాయ వనరు బీడీ పరిశ్రమ. కొన్ని ప్రాంతాల్లో కుటుంబ యజమాని బొంబాయి, దుబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్తే, వారి నుంచి కుటుంబానికి ఆదాయం రావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. అంతకాలం ఆయా కుటుంబాలు బీడీలు చేయడం ద్వారానే జీవనోపాధి పొందుతారు. చిన్నపిల్లల తల్లులు వ్యవసాయ పనులకు, బయటి పనులకు వెళ్లలేరు. వారికి రోజు గడవటం చాలా కష్టం. వీరికి ఏకైక మార్గం బీడీలు చుట్టడం. అమూర్తంగా ఉండే మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ విధానాలను ప్రజల నుంచి పారదోలడం ఇప్పటికే ప్రభుత్వాల నుంచి కావడం లేదు. నేరుగా జీవనోపాధిని కల్పించే పరిశ్రమను వారికి భౌతికంగా దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జీవో తీయడం అనేక సంశయాలకు స్థానం కల్పించింది. సిగరెట్ కంపెనీల ఒత్తిడి మేరకే బీడీ పరిశ్రమపై ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నట్లు బీడీ కార్మికులు భావిస్తున్నారు. 


గతం లో ఇదే అంశంపై కేంద్రస్థాయిలో చర్చ జరిగినప్పుడు నేడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని మంత్రుల కమిటీ పుర్రె గుర్తును అరవై శాతం బదులు నలభై శాతం మేరకు ముద్రించాలని నిర్ణయించింది. కానీ ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎనభై అయిదు శాతం పుర్రె గుర్తును బీడీ కట్టపై ముద్రించాలని హెచ్చరింది. ఇది ఎంత అసంబద్ధమైనదంటే ఏదైనా వస్తువు కవర్‌పై 85 శాతం ముద్రించిన తర్వాత మిగిలిన భాగంలో వస్తువు తయారీదారు పేరు కూడా రాసే అవకాశం తక్కువ. వినియోగదారుడు తను కొనే వస్తువు ధరను స్పష్టంగా చూసుకునే స్థితి ఉండదు.

రాష్ట్రంలో వ్యవసాయం, భవన నిర్మాణ రంగం తర్వాత ఆ స్థానంలో బీడీ కార్మికులుంటారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే చేయూత శూన్యం. ఈ పరిశ్రమకు విద్యుత్, నీరు, మౌలిక వసతుల వంటివి ప్రభుత్వం కల్పించవలసిన అవసరం లేదు. పొగాకు కాకుండా మరే ఇతర రసాయనాలు, నిల్వ పదార్థాలు ఉపయోగించడంలేదు. రాష్ట్రంలో బీడీలు చుట్టేవారు సుమారు 75 లక్షల వరకు ఉంటారు. వీరికి అనుబంధంగా తునికాకు సేకరణ మార్కెటింగ్, రిటేల్ అమ్మకాలు నిర్వహించేవారు మరో మూడు లక్షల మంది ఉంటారు. ఇందులో మహిళలు 95 శాతం వరకు ఉంటారు. అందరూ దళిత, వెనుకబడిన, బలహీనవర్గాలకు చెందినవారే. (దేశ ప్రజల తలసరి ఆదాయం పెంచవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ కేంద్రం తన జీవోతో లక్షలాది మంది నిరుపేదల జీవనోపాధినే హరించేందుకు ప్రయత్నిస్తున్నది.) తునికాకు సేకరించడం ద్వారా ఆదివాసీలు, గిరిజనులు ప్రతి సంవత్సరం ప్రధాన ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వాల నుంచి అనేక రాయితీలు పొందిన ఆధునిక పరిశ్రమలు ఇస్తున్న ఉపాధికంటే ఎన్నోరెట్ల మందికి సహజంగా ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమ ఇది.


కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని బీడీల ఫ్యాక్టరీలన్నీ ఈ నెల మొదటి తేదీ నుంచి మూతపడ్డాయి. పుర్రె బొమ్మ హెచ్చరిక 85 శాతం ఉంటే మా ఉత్పత్తులను అమ్ముకునే స్థితి ఉండదనే నిర్ణయానికి యాజమాన్యాలు వచ్చాయి. ఫలితంగా మన రాష్ట్రంలో పది లక్షలకుపైగా మంది జీవనోపాధికి దూరమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య కోటిన్నర ఉంటుంది. ఒక దేశంలో కోటిన్నర మందికి ప్రత్యక్షంగా నష్టం కలుగుతుంది. ఇంతమంది ప్రజానీకాన్ని ఉపాధికి దూరం చేయడం అంటే ఒక సంక్షోభాన్ని సృష్టించడమే. సంక్షేమ దృక్పథాన్ని వదిలి ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించడం వల్ల సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కోటిన్నర ప్రజల జీవనోపాధిని ఒక్కసారే దెబ్బతీస్తే అది ప్రకృతి విలయాన్ని మించిన సంక్షోభాన్ని కారణమౌతుంది. జీవనోపాధి లేని ఇంతమంది ప్రజలు ఏ నుయ్యో, గొయ్యో చూసుకోవడమో, అసాంఘికశక్తులుగా మారడమో చేస్తారు. ఎందుకంటే ఈ రంగంలోని ప్రజలలో అధికశాతం నిరక్షరాస్యులు వారికి వేరే ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఆ పరిశ్రమను మూసేందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణం. ఇప్పటికే వారానికి నాలుగు రోజులు పని దొరుకుతున్నది. ఈ నెలారంభం నుంచి అది కూడా పోయింది.


కేంద్ర ప్రభుత్వానికి పొగాకు వినియోగం నియంత్రించాలని చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రాజెక్టుగా భావించాలి. ఆ ప్రాజెక్టులో భాగంగా బీడీ పరిశ్రమపై దాన్ని ఆధారపడిన కార్మికులు, రైతులను క్రమంగా ఆ పరిశ్రమకు దూరం చేయాలి. ఎంతమందిని ఆ పరిశ్రమ నుంచి దూరం చేస్తారో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపాలి. అందుకయ్యే అన్నిరకాల వ్యయప్రయాసలు ప్రభుత్వమే భరించాలి. కొత్తరంగానికి మరల్చేక్రమంలో అందుకు అవసరమైన నైపుణ్యాలపై ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పించాలి.


మద్య నిషేధం వల్ల మద్యం తాగేవారు తగ్గుతారని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే బీడీలు తాగేవారు అవి దొరకకుంటే సిగరెట్ల వైపు మళ్లుతారు. అది ఏకంగా పొగాకు వినియోగాన్ని తగ్గించినట్లఅవుతుంది. పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిషేధించదలుచుకుంటే ప్రభుత్వం ఈ రంగంలో కార్మికులకు అనుబంధంగా పనిచేసేవారికి ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితి విధించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ క్రమంగా నిర్వహించవలసిన ప్రక్రియ.


కాబట్టి తక్షణం కోటిన్నర ప్రజల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని పుర్రెగుర్తు సైజుపై కేంద్రం మొండి వైఖరికి పోవద్దు. కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు సానుకూలంగా వ్యవహరించాలి. ఈ మధ్య కాలంలో ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల పార్లమెంట్ సభ్యులు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల కేంద్రం ముందుగా పుర్రె గుర్తు గురించి కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై పార్లమెంట్ వేదికపై చర్చించి, తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వాతావరణంలోఈ చర్యను దేశవ్యాప్తంగా ప్రజల ముందుంచాలి. కానీ ఇలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఏకపక్షంగా వెలువరించరాదు.

(వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి