గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 01, 2015

పాఠ్యాంశాల్లో ఆంధ్రా ప్రభుత్వం అల్పబుద్ధి...!!!

  • ఇప్పుడు ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో కొత్త పుస్తకాలు వచ్చాయి. రెండింటిని ముందుపెట్టుకుని కూర్చుంటే ఎవరెంత అల్పబుద్ధి ప్రదర్శించారో తెలుస్తుంది. శ్రీశ్రీని మహాకవిగా తెలంగాణ ఒప్పుకున్నది. కానీ కాళోజీని వారు ప్రజాకవిగా గుర్తించలేదు. అల్లూరి సీతారామరాజు పరాక్రమాన్ని కీర్తించింది తెలంగాణ. కొమురం భీం అనే వీరున్ని కనీసం గుర్తించలేకపోయింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. 

తెలంగాణపై విద్వేషం చిమ్మే క్రమంలో తమ సొంత రాష్ట్ర ప్రజలకే ఎక్కువ నష్టం చేసుకునే పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొకటి చేసుకుంటున్నది. తాజాగా పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర, ఈ ప్రాంతానికి చెందిన కవులు, రచయితల ప్రస్తావనలు, ప్రముఖుల చరిత్రలు తొలగించారు. ఇది తెలంగాణపై ఉన్న కోపంతో చేసిన పనే తప్ప దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనమేమీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నష్టం కలిగించే చర్య. తెలుగు పద్యాలు, తెలుగుభాష గురించి సంపూర్ణ అవగాహన కలగాలంటే.. కేవలం ఆంధ్రప్రాంతం వారు రాసిన పద్యాలు, రచనలు చదివితేనే సరిపోదు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు నిన్నమొన్నటి దాకా కలిసున్న ప్రాంతాలు. దాదాపు ఆరు దశాబ్దాలు ఒకటిగా ఉన్న చరిత్ర ఉన్నది. దీన్ని ఎవరూ చెరిపేయలేరు. 



gatika

ఎవరైనా సరే చరిత్ర పునాదుల మీదే భవిష్యత్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ చరిత్ర వద్దనుకుంటున్నది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు ఏమాత్రం నష్టం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే ఎక్కువ నష్టం. శ్రీకృష్ణ కమిటీకి ఆంధ్ర నాయకులు ఇచ్చిన నివేదిక ప్రకారం... హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 40 లక్షల మంది ఉన్నారు. మరి వారిప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదువుకోవాలా? తెలంగాణ చరిత్ర చదువుకోవాలా? తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అక్కడి కవుల రచనలు, అక్కడి ప్రముఖుల జీవితం వద్దనుకుంటే ఏమవుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంతకాలం అక్కడి నాయకులు చేసిన నష్టానికి, అన్యాయానికి కొనసాగింపే పాఠ్యాంశాల్లో మార్పులు. 


ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారి చరిత్ర తెలువకుండా చేశారు. పొట్టి శ్రీరాములు అనే మహనీయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసినట్లు చరిత్రను వక్రీకరించి చెప్పారు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందనే వాస్తవాన్ని మరుగున పడేలా చేశారు. ఆంధ్ర రాష్ట్రం అవతరించింది 1953 అక్టోబర్ 1న అనే విషయమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు. ఇక రేపటి తరానికి గతం తెలిసే అవకాశం లేకుండా చరిత్రను చెరిపే ప్రయత్నం చేశారు. మొన్నటిదాకా అమలులో ఉన్న పాఠ్యాంశాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన ఉందే తప్ప, ఆంధ్రరాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి గురించి లేదు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953లోనే ఏర్పడిందనే సంగతి కూడా అక్కడి ప్రజలకు తెలియదు. 


సొంత రాష్ట్రంగా మనుగడ సాగించి, స్వయం సమృద్ధి ప్రాంతంగా అభివృద్ధి చేయడం చేతకాక ఆ చరిత్రను గుర్తు లేకుండా చేయడమే పనిగా పాఠ్యాంశాలు రూపొందించారు. ఇప్పడు హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి, తెలంగాణ రచయితల గురించి తెలుసుకోకుంటే నష్టపోయేది ఎవరు? తెలంగాణ విద్యార్థులు ఎంత మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి గిట్టని ప్రాంతం కావచ్చు కానీ, ఇది భారతదేశంలో అంతర్భాగం. నిన్నమొన్నటి వరకు ఆంధ్రతో కలిసున్న రాష్ట్రం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నీడనిస్తున్న ప్రాంతం. లక్షలాదిమంది ఆంధ్రులకు అన్నం పెడుతున్న ప్రాంతం. దీని గురించి భావితరాలు తెలుసుకోకూడదు అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. 


ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాతే తెలంగాణలో కూడా పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయి. కానీ శాస్త్రీయ పద్ధతిలో జరిగాయి. ఆంధ్ర ప్రాంత కవులు, ఆంధ్రచరిత్ర, అక్కడి విశిష్ట వ్యక్తులను ఎక్కడా విస్మరించలేదు. బంకిం చంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్‌లు ఏ భాష వారనే విషయం పట్టించుకోకుండా వారి రచనలు విద్యార్థులు చదవాలని తెలంగాణ ప్రభుత్వం భావించినట్లే, శ్రీశ్రీ, జాషువా, వేమన లాంటి వారు ఎక్కడి వారన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా వారి సాహిత్యం నుంచి విద్యార్థులు నేర్చుకోవాలనే నిర్ణయించింది. అందుకే తెలంగాణ పాఠ్యాంశాల్లో ఆంధ్ర, తెలంగాణ కోణం కనిపించదు. చరిత్ర సమగ్ర అధ్యయనానికి, సాహిత్యంపై అవగాహనకు, గొప్పవ్యక్తుల స్మరణకు భాషా భేదం వుండవద్దనే కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తయారయ్యాయి తెలంగాణలో పాఠ్యాంశాలు. 


ఇప్పుడు ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో కొత్త పుస్తకాలు వచ్చాయి. రెండింటిని ముందుపెట్టుకుని కూర్చుంటే ఎవరెంత అల్పబుద్ధి ప్రదర్శించారో తెలుస్తుంది. శ్రీశ్రీని మహాకవిగా తెలంగాణ ఒప్పుకున్నది. కానీ కాళోజీని వారు ప్రజాకవిగా గుర్తించలేదు. అల్లూరి సీతారామరాజు పరాక్రమాన్ని కీర్తించింది తెలంగాణ. కొమురం భీం అనే వీరున్ని కనీసం గుర్తించలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కందుకూరి వీరేశలింగం సమాజ సంస్కరణల కోసం చేసిన కృషిని తెలంగాణ పిల్లలు తప్పక తెలుసుకోవాలని కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం. కానీ పీవీ నర్సింహారావు, ఈశ్వరీ భాయి, భాగ్యరెడ్డివర్మ లాంటి వారిని విస్మరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ పాఠ్యాంశాల్లో నన్నయ పద్యాలు, శ్రీశ్రీ గేయాలు, నీతి పరిమళాలు పేరుతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ కవులు రాసిన నీతి పద్యాలు కొనసాగించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వట్టికోట అళ్వార్‌స్వామి, దాశరథి లాంటి వారు రాసిన పద్యాలు, రచనలు తీసేశారు.

తెలంగాణలోని తెలుగు పుస్తకంలో ఎర్రన రాసిన మహాభారత పద్యాలు, చిన్నయసూరి రాసిన విలువలు అనే కథ, గడియారం వెంకట శేషశాస్త్రి రాసిన స్త్రీలపట్ల గౌరవం అనే పద్యం, బోయి భీమన్న రాసిన శ్రమపట్ల గౌరవం తెలిపే లేఖ, విశ్వనాథ సత్యనారాయణ రాసిన హాస్యం అనే నాటిక, ఓల్గా-వసంత-కల్పన కలిసి రాసిన స్త్రీ సాధికారత అనే పీఠిక, కందుకూరి వీరేశలింగం పరిచయం ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు పుస్తకాల్లో బూర్గుల రామకృష్ణారావు గురించి పీవీ నరసింహారావు రాసిన వ్యాసం, అలిశెట్టి ప్రభాకర్ రాసిన పద్యాలు, కాపు రాజయ్య, మిద్దె రాములు లాంటి వారి పరిచయాలు తొలగించారు. 


శతక కవులంటే అందరికీ తెలిసిన వారు, తెలిసిన పద్యాలు కొన్ని ఉన్నాయి. వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, రాజశేఖర శతకం, సర్వేశ్వర శతకం, కుమార శతకం లాంటివి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లో కేవలం ఆంధ్ర కవులవి ఉంచి, తెలంగాణ వారివి తీసేశారు. అదే తెలంగాణలో వేమనతో సహా అందరి శతకాలను యథావిధిగా విద్యార్థులకు అందించారు. మల్ల భూపాలీయం, అందె వెంకటరాజం, ఇమ్మడి శెట్టి చంద్రయ్య, కొత్తపల్లి భీమయ్య లాంటి వాళ్ల శతక పద్యాలు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో పెట్టలేదు. 


పాఠ్యాంశాల్లో కథలు, కథానికలు, పద్యాలు, ప్రాచీన పద్యాలు, ఆధునిక పద్యాలు, గేయాలు, వ్యాసాలు, వచన కవితలు, మంచి పుస్తకాల పరిచయాలు ఎక్కువగా ఉండాలి. సమపాళ్లలో ఉండాలి అని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కేవలం ఆంధ్ర ప్రాంతం వారు కావడమే అర్హతగా గత ప్రభుత్వాలు కొందరి గురించి గోరంతలు కొండంతలు చేసింది. ఆ తప్పు తెలంగాణ పాఠ్యాంశాల్లో దొర్లలేదు. అయితే అర్హత ఉన్న రచనలను ఆంధ్ర ప్రాంతం వారు రాసినవి కాబట్టి తొలగిద్దామనే అల్పబుద్ధిని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించలేదు. అలాంటి పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. పోతన తెలంగాణ ప్రాంతం వారు కాబట్టి ఆయన పద్యాలను తొలగిస్తే, మహాభాగవత కావ్యం విద్యార్థులకు ఎలా బోధించగలుగుతారు? బూర్గుల రామకృష్ణారావు చేసిన త్యాగం గురించి చెప్పకపోతే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మూలాలు ఎక్కడ దొరుకుతాయి? హైదరాబాద్ గురించి మనకు అవసరం లేదనుకుంటే, పదేళ్ల ఉమ్మడి రాజధాని గురించి రేపటి తరం ఏమి తెలుసుకోవాలి?


నిజానికి స్థానిక చరిత్ర పేరుతో హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమం పేరుతో సమైక్య రాష్ట్రంలో ఎనిమిదవ తరగతిలో తెలుగు ఉపవాచకం రూపొందించారు. దానిని ఆంధ్రప్రదేశ్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లేదనే సాకుతో తొలగించారు. మరి ఆ విమోచన ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం వారు కూడా సహకరించారు. తెలంగాణ వారి గురించి తెలుసుకోవద్దనే దుర్భుద్ధిలో వాళ్ల వారి గురించి కూడా తెలుసుకునే అవకాశం కాలరాశారు. తెలుగు పుస్తకాల్లో నెహ్రూ లేఖలు, వినోభాబావే భూదానం, తిలక్ వ్యాసాలు, సత్యజిత్ రే రచనలు, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్రచటర్జీ లాంటి వాళ్ల వ్యాసాలున్నాయి. అలాగే కొడవటిగంటి కుటుంబ రావు తాత్త్విక వ్యాసాలున్నాయి. 


ఆ రచనల గొప్పతనాన్ని చూడాలి తప్ప వారికి ప్రాంతీయత అంటకడితే ఎలా? దాశరథి, కాళోజీ, సుద్దాల హన్మంతు లాంటి వాళ్లు జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్ళు కాదా? భారత ప్రభుత్వం కాళోజీని పద్మవిభూషణ్‍తో సత్కరించలేదా? ఆ వాస్తవం విస్మరించడం జాతిద్రోహం కాదా? ఆంధ్రప్రాంతానికి చెందిన వారైనప్పటికీ మధురాంతకం రాజారాం, దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి లాంటి వారిని విస్మరించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంది. ఎంత గొప్పవారైనా సరే, ఎంత గొప్ప రచనైనా సరే తెలంగాణ వారైతే తీసి పారేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 


మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో మాతృగీతంగా పెట్టుకున్నారు. కానీ తెలుగంటే కేవలం ఆంధ్రకవులు రాసిందే అని ఆచరణలో చూపిస్తున్నారు. దేశభాషలందు తెలుగులెస్స అని కూడా గొప్పగా రాసుకున్నారు. కానీ ఆ తెలుగు పూర్తిగా ఆంధ్ర వారి సొంతం అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని తెలుగు రాష్ట్రంగా, తెలంగాణ చరిత్ర కూడ తెలుగు వారి చరిత్రగా, తెలంగాణలోని గొప్ప వ్యక్తులను కూడా తెలుగు జాతికి చెందిన గొప్ప వ్యక్తులుగా ఒప్పుకునే విశాల దృక్పథం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొరవడింది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




1 కామెంట్‌:

కమనీయం చెప్పారు...



నిజమే.రెండు రాష్ట్రాల పాఠ్య పుస్తకాల్లోను ,చరిత్ర పుస్తకాల్లోను మొత్తం తెలుగు జాతికి చెందిన ప్రముఖుల గురించి తెలియజెయ్య వలసిందే.సంకుచితత్వం పనికి రాదు. కాని తొలగించిన భాగాల్ని మళ్ళీ తీసుకొన్నట్లు ఎక్కడో చదివినట్లు గుర్తు.సరిగా తెలియదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి