గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 29, 2015

ఇదీ...మన తెలంగాణ సంస్కృతి అంటే...!!!


తెలంగాణ ప్రజలది మూలవాసి సంస్కృతి. ఆది మానవుడు నడయాడిన దశ నుంచి, ఆధునిక నాగరికత వరకు తెలంగాణ ప్రజల మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్లో వైవిధ్యం, విభిన్నత చోటుచేసుకున్నది. నాగార్జున కొండ, ఏకశిలా నగరాల బౌద్ధ ఆరామాలను బట్టి, ఇక్కడ బౌద్ధమతాన్ని ప్రజలు పెద్ద మొత్తంలో ఆదరించారనే విషయం అర్థమవుతుంది. బౌద్ధుల తర్వాత, జైనమతం తెలంగాణలో అడుగుపెట్టింది. నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జైన మతానికి సంబంధించిన, అనేక ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. భువనగిరి సమీపంలోని కొలను పాక జైన మందిరాన్ని ప్రజలు విస్తృతంగా సందర్శిస్తుంటారు. 

బౌద్ధ, జైన మతాల తర్వాత, ఉత్తర భారతం నుంచి వచ్చినది ముస్లిం మతం. పాలకులుగా ముస్లింలు సుమారు నాలుగువందల ఏళ్ల పాటు పాలించడం వల్ల ఇక్కడి సంస్కృతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఉర్దూ పాలనాభాష కావడం కారణంగా విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది ఇస్లాంమతాన్ని స్వీకరించారు. ముస్లిం పాలనలోనే క్రైస్తవ, సిక్కు, పార్సీ తదితర మతాలు కూడా, తెలంగాణ నేలపైన అడుగుపెట్టాయి.ఇలా భిన్నమతాల సంగమంగా తెలంగాణ సంస్కృతి పేరుగాంచింది.
తెలంగాణ అనగానే గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు మొదలైన పండుగలు తెలంగాణ ప్రత్యేకతను నిలబెడుతున్నాయి. ఈ పండుగలను మిగిలిన ఏ ప్రాంతంలోనూ జరుపుకోరు. అలాగే పువ్వులతో పండుగ చేసుకునే చరిత్ర ప్రపంచంలో మరెక్కడా కానరాదు. తెలంగాణ ప్రజలు ఎంతటి ప్రకృతి ఆరాధకులో బతుకమ్మ పండుగను చూస్తే అర్థం అవుతుంది. శ్రమలో భాగంగా ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణలో ఇప్పటికీ కనిపిస్తుంది. బతుకమ్మ తర్వాత తెలంగాణలో పెద్ద పండుగ దసరా. నిజానికి దసరా పండుగ దేశమంతటా జరుపుకునేదే అయినప్పటికీ, తెలంగాణలో జరుపుకునే తీరులో వైవిధ్యమున్నది. పండుగను సద్దులు, దసరా, పిల్ల దసరా పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఏ పండుగైనా ఒక్కరోజు, రెండురోజులో ఉంటే, దసరా మాత్రం తెలంగాణలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను చూడడానికి పొలాల్లోకి వెళతారు. తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే ఆచారం ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే దసరా నాటి సాయంత్రం, జమ్మి ఆకు పంచుకొని, పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. 
హిందూ ముస్లిం సోదరత్వానికి చిహ్నంగా దర్గా, ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా పీరీల పండుగను కూడా తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అలావ సుట్టూ అడుగులు వేస్తూ..పాటలు పాడుకుంటారు. దసరాతో పాటు ఉత్తర భారతీయుల వలసతో తెలంగాణకు వచ్చిన పండుగ హోళీ. ఇది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని ముఖ్యపట్టణాల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ, హోళీ పండుగలపై ప్రత్యేకంగా పాటలు కూడా రూపొందించుకున్నారు ఇక్కడి ప్రజలు. ఇక ఆహారం విషయానికోస్తే తెలంగాణ వంటకాలు కూడా మిగిలిన తెలుగు సమాజపు రుచులలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సకినాలు, బచ్చాలు, బిర్యానీ తదితర కమ్మటి రుచులు, తెలంగాణ ఆహారపు ప్రత్యేకతలను చాటుతాయి.
ఇంతటి ఘనమైన సంస్కృతి ఉమ్మడి పాలనలో వివక్షకు గురైంది. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు వలస పాలకులు. తమదే గొప్ప భాష, సంస్కృతి, చరిత్ర అన్నట్టుగా వ్యవహరించారు. ఈ అణచివేత, వివక్ష దశాబ్దాల పాటు కొనసాగింది. మరోవైపు రాజకీయంగా కొనసాగిన ఆధిపత్యం తెలంగాణ ప్రజలను మరింత బానిసత్వంలోకి నెట్టింది. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ కనిపించని కుట్రలపైన తెలంగాణ ఉద్యమం ఐగ్గె మండింది. సకల కుట్రలను కుల్లం కుల్ల చేసింది.
అన్యాయాలకు ఊతమిస్తున్న పాలనను మార్చకుంటే తెలంగాణ బాగుపడదని భావించింది. అలా ఉమ్మడి రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచే ఉద్యమం మొదలైంది. లక్షలాదిమంది పోరాటం, వేలాదిమంది త్యాగాల ఫలం, కేసీఆర్ మహోన్నత నాయకత్వం తెలంగాణరాష్ర్ట స్వప్నాన్ని నిజం చేశాయి. గడిచిన ఏడాది కాలంగా మళ్లీ ఛిద్రమైన బతుకులను సరిదిద్దే పని మొదలైంది. పడావు పడ్డ వ్యవసాయాన్ని బాగుచేయడం కోసం తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. నూటికి అరవై శాతం తెలంగాణ జనాభాకు ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధా రం.
రైతుల బతుకులు బాగుచేయడానికి మొదలుపెట్టిన చారిత్రాత్మక పథకమే మిషన్ కాకతీయ. ఆనవాళ్లు కోల్పోయి నిర్వీర్యంగా మారిన చెరువులను, పునరుద్ధరించేందుకు సీఎం కేసీ ఆర్ పూనుకున్నారు. ఆనాడు కాకతీయ కాలంలో ప్రజల బతుకులు పచ్చబడేలా చేసిన చెరువులకు, ఇన్ని రోజులకు మళ్లీ జీవమొచ్చింది. ఊరూరా చెరువుల పండుగ షురువైంది. ఇక వానలు పడడమే ఆలస్యం. రైతులు, కూలీల నుంచి మొదలు చేతివృత్తుల వారి వరకు పనిదొరకనుంది. ఎనకటి మంచికాలం మళ్లీ మనముందుకు రానుంది. 
అంతేకాదు వృద్ధులకు ఆసరా, దళిత, మైనారిటీ ఆడపిల్లల పెళ్లిల్లకు 51వేల రూపాయల ఆర్థికసాయం అందించే కళ్యాణలక్ష్మీ, కళాకారులకు ఉద్యోగాలు, హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం, ఇంటింటికి తాగునీరందించే వాటర్ గ్రిడ్, కోతల్లేని కరెంటు సరఫరా, పరిసరాలను పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛ్ హైదరాబాద్, స్వచ్ఛ్ తెలంగాణ, పచ్చదనం కోసం ఊరూర పెంచే హరితహారం, ఉపాధి అవకాశాలను అందించే ఇండస్ట్రీయల్ పాలసీ- ఐపాస్ వంటి పథకాలన్నో తెలంగాణను తనకాళ్ల మీద తాను నిలబడేలా చేయనున్నాయి. ఈ పథకాలు, ప్రభుత్వ కృషి వల్ల గత సంస్కృతి మళ్లీ వేయి కాంతులతో విలసిల్లనుంది.

ఉమ్మడిపాలనలో దశాబ్దాలుగా జరగని అభివృద్ధి సంవత్సర స్వయంపాలన కాలంలో జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం, ధీమా ఏర్పడ్డాయి. మన పండుగలు, పబ్బాలకు గత వైభవం రావడం మొదలైంది. అందుకు సాక్ష్యమే అధికారికంగా ఈ యేడాది జరిపిన ఎన్నో పండుగలు. తెలంగాణ వైతాళికుల వర్ధంతులు, జయంతుల నిర్వహణ, ట్యాంక్‌బండ్ మీద ఈసారి తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ పండుగకు కొత్త జవజీవాలను అద్దింది. బతికిచెడ్డ గడ్డను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతీ పౌరుడు కంకణబద్ధుడు కావాలి. గత వైభవాన్ని తిరిగి సాధించి, దేశంలోనే ఆదర్శ రాష్ర్టంగా నిలబెట్టుకునేందుకు గడిచిన సంవత్సరకాల పాలన ఒక విశ్వాసాన్ని అందించింది. రానున్న రోజులు తెలంగాణ బిడ్డల సంస్కృతికి మరింత కొత్తమెరుగులద్దుతుంది. సారవంతమైన తెలంగాణ సంస్కృతి సంపద దశ దిశలా కాంతులీనుతుంది.  ఇదే మన లక్ష్యం...ఇందుకై ..మన ముఖ్యమంత్రి కేసీఆర్‍తో సహా...మనమంతా కృషిచేద్దాం. ఎవరైనా అడ్డుపుల్ల వేయాలని చూస్తే...తగిన బుద్ధి చెప్పుదాం.

వ్యాసకర్త: సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి