గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

ఫీజు రీయింబర్సుమెంటు మహత్వం...!!

-విద్యార్థులు కరువై కళాశాలలు వెలవెల
- స్వయంగా మరణశాసనం రాసిన గత ప్రభుత్వం.. రీయింబర్స్‌మెంటుతో ప్రైవేటుకు లబ్ధి
- లాభసాటి వ్యాపారంగా ప్రైవేటు కాలేజీలు.. నగదు, సెల్‌ఫోన్లతో యాజమాన్యాల ఎర
- సర్కారు కాలేజీలపై ఏటా కోట్లు వ్యయం.. నిష్ఫలమవుతున్న యూజీసీ నిధులు
- ఫాస్ట్ పథకంలోనైనా మార్పు తేవాలంటున్న విద్యావేత్తలు

విశాలమైన ఆవరణ.. పెద్దపెద్ద గదులు.. భారీ వరండాలు.. గదుల నిండా ఫర్నిచర్.. బ్లాక్ బోర్డులు.. గాలీ వెలుతురుతో ఆహ్లాదకరమైన తరగతులు.. లైబ్రరీ.. ల్యాబ్‌లు.. క్రోటన్ మొక్కల వరుస.. బయట గేటు మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో సగర్వంగా బోర్డు! ఇదీ ఒకనాటి వైభవం. ఈ కళాశాలలనుంచే మహానాయకులు, అత్యున్నత స్థాయికి ఎదిగిన అధికారులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, సాహిత్యకారులు ఎందరెందరో ఉద్భవించారు. ఈ కళాశాలల్లోనే దేశానికి కొత్త మార్గాలు చూపించిన ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. నేను చదివిన కళాశాల అని రొమ్ము విరుచుకుని సగర్వంగా చెప్పుకోగలిగిన చరిత్ర! నేను పాఠాలు చెప్పాను అంటూ అధ్యాపకులు ఉదహరించగలిగిన వైభవం! సకల సమాజ వర్గాలన్నింటినీ ప్రతిబింబించిన మరో ప్రపంచం. దశాబ్దాలపాటు వెలుగు వెలిగి, లక్షలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఇవాళ శిథిలాలయాలుగా మారిపోయాయి. చదివే విద్యార్థులే దొరకక కునారిల్లుతున్నాయి. ప్రైవేటీకరణ మహమ్మారి, ప్రభుత్వమనే మాయలమారి కాసుల వేటలో తెచ్చిన ఒక్క పథకం వాటన్నింటి ఉసురు తీసింది!!
sknr2
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. నిర్వహణకోసం ఏటేటా కోట్ల రూపాయలు వ్యయంచేస్తూ వీటిని నిలబెట్టాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విద్యార్థులు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఏటా ఈ కాలేజీలకు మంజూరు చేస్తున్న కోట్ల రూపాయలు కూడా నిరుపయోగం అవుతున్నాయి. ప్రైవేటు కాలేజీల ప్రకటనల పటాటోపం ముందు ప్రభుత్వ కళాశాలలు కనిపించడం లేదు. ఎదురు డబ్బులిచ్చి ఎర వేయడాలు, సెల్‌ఫోన్లు బహుమతులిచ్చే వ్యాపార సంస్కృతి ముందు ఈ కళాశాలలు వెలవెలబోతున్నాయి. సకల సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వ కళాశాలలు వెనుకబడడం అంటుంచి రేసులోనే లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల దుస్థితిపై కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో ఆ డిగ్రీ కళాశాలలు వెంటిలేటర్‌పై ఉన్న వాస్తవం వెల్లడైంది. తక్షణమే పూనుకొని ఏదో ఒకటి చేయకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందనే నిజం బయటకు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓవైపు ఈ కళాశాలలను బతికించేందుకు ప్రయత్నించానన్న ప్రభుత్వమే తన చేతులతోనే వాటి ఆయువును కూడా హరించేందుకు సిద్ధపడింది. పేద విద్యార్థుల కోసమంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే ఇపుడు ప్రభుత్వ కాలేజీలకు మరణశాసనమైంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో లేని సాంకేతిక (ఇంజినీరింగ్) విద్య, వైద్య విద్య, ఇతర వృత్తిపరమైన కోర్సులకు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలో న్యాయం ఉంది. ఎలాగూ సర్కారు కళాశాలలు తగిన స్థాయిలో లేనపుడు విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అది అవసరం కూడా. కానీ ప్రత్యేక పరిస్థితిలో ఆ కోర్సులకోసం ప్రవేశపెట్టిన రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆ అవసరమే లేని కోర్సులకు కూడా వర్తింపచేయడం మాత్రం దారుణం. అప్పటి ప్రభుత్వం కొందరు దళారులతో కుమ్మక్కయి ఈ పథకాన్ని డిగ్రీ కళాశాలలకు సైతం వర్తింపజేసింది.

వాస్తవానికి ప్రభుత్వరంగంలోనే విద్యార్థుల డిమాండ్‌కు సరిపోయినన్ని కళాశాలలున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరిగితే అవసరాన్నిబట్టి ఎన్ని తరగతులనైనా విస్తరించుకునే స్థాయిలో విశాలమైనభవనాలూ ఉన్నాయి. అయినా కాసుల కక్కుర్తితో ప్రైవేటు కళాశాలలకు కూడా ఈ పథకం వర్తింపచేశారు. దానితో ప్రైవేటు కళాశాలలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. నాలుగు డబ్బులు చేతిలో ఉన్న ప్రతివాడూ ఓ కాలేజీ పెట్టేశాడు. నాలుగు గోడలుంటే తరగతి గది. నాలుగు గదులుంటే కళాశాల అన్నట్టు పరిస్థితి తయారైంది. పాతికాపరకా ఇచ్చి లెక్చరర్లను పెట్టుకుని లాగిస్తూ విద్యార్థులకు సర్కారు అందించే సొమ్ముతో కోట్లు సంపాదించడం ప్రారంభమైంది. పోటీ పెరిగి సర్కారు ఇచ్చే సొమ్ములోంచి కొంత డబ్బు ఎదురు చెల్లింపులు, సెల్‌ఫోన్లవంటి ఆఫర్లు పుట్టుకొచ్చాయి. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చావుకు దగ్గరయ్యాయి.

పది జిల్లాల్లో 113 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో 113 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 11 చొప్పున ఉండగా, కరీంనగర్‌లో 16, వరంగల్‌లో 13, నిజమాబాద్‌లో 9, మహబూబ్‌నగర్‌లో 18, మెదక్‌లో 15, రంగారెడ్డిలో 5, హైదరాబాద్‌లో 7 కాలేజీలున్నాయి. ఇవన్నీ దాదాపు స్వంత భవనాల్లో ఉన్నాయి. ఈ కాలేజీలకు ఆర్థికశాఖ 2761 అధ్యాపక పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం 1384 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.

1377 పోస్టులు ఖాళీగా ఉండగా కాంట్రాక్టు విధానంపై లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రతి కాలేజికి ఒక్క గ్రంథపాలకుడి పోస్టు, క్రీడాఅధ్యాపకుడి పోస్టు, ఒక ప్రిన్సిపాల్ పోస్టు ఉన్నాయి. కాలేజీ నిర్వహణకు 15మంది బోధనేతర సిబ్బంది పోస్టులున్నాయి. ఈ విధంగా 113 కాలేజీల్లో 1800ల మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా మరో 500 మంది ఆఫీసు సబార్డినేట్స్ విధులు నిర్వహిస్తున్నారు. సగటున ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.2కోట్ల దాకా వ్యయం చేస్తున్నది. అన్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుతో పాటు కనీసం ఇరవై లెక్చరర్ల పోస్టులున్నాయి. డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఉపన్యాసకుల కనిష్ఠ వేతనమే నెలకు యాభై వేలుగా ఉంది.

ఏ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్‌కైనా కనీస వేతనం లక్ష రూపాయలుంది. బోధనేతర సిబ్బందిని కూడా కలుపుకొంటే ఒక కాలేజీ నిర్వహణకు రెండు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని తదితర పెద్ద పెద్ద కళాశాలలకోసం ఏటా 3నుంచి 4కోట్ల రూపాయలను కేవలం వేతనం కింద చెల్లిస్తున్నది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఏటా దాదాపు రూ.250 కోట్లు, వేతనాలు కాకుండా ఇతర నిర్వహణ కోసం మరో రూ.100కోట్ల వ్యయం జరుగుతున్నది. దాదాపు అన్ని డిగ్రీ కాలేజీల్లోను ల్యాబ్స్, కంప్యూటర్స్‌వంటి సౌకర్యాలు సమకూరాయి. ప్రతి కాలేజీలోను పదివేలకు తగ్గకుండా పుస్తకాలతో గ్రంథాలయాలున్నాయి.

వెల్లువలా యూజీసీ నిధులు..

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగాన్ని పటిష్ఠం చేసే లక్ష్యంతో యూజీసీ న్యాక్ బృందం ప్రతి కాలేజీలో ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు తదితరాలను పరిశీలించి, గ్రేడింగ్స్ ఇస్తుంది. ఏ, బీ క్యాటగిరీల్లోని కాలేజీల్లో వసతులను మరింత మెరుగు పర్చుకునేందుకు ఇతర విద్యా సౌకర్యాల కల్పనకు ఏటా రూ.కోటి మంజూరు చేస్తున్నారు.

అర్హత గల అధ్యాపకులకే అవకాశం..

డిగ్రీ కళాశాలల్లో బోధనకోసం అన్ని అర్హతలున్న అధ్యాపకులను మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో పీజీ కోర్సులో 55% మార్కులు సాధించిన వారినే లెక్చరర్ పోస్టుకు అర్హులుగా పరిగణించేవారు. యూజీసీ తెచ్చిన మార్పుల నేపథ్యంలో అర్హతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పీజీతో పాటు జాతీయ స్థాయి ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), లేదా స్లెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్), పీహెచ్‌డీ అర్హతగా నిర్ణయించారు. ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ పొందాలంటే అధ్యాపకుడు కచ్చితంగా పీహెచ్‌డీ చేసి ఉండాలనే నిబంధన తెచ్చారు. జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీ అధ్యాపకులుగా ప్రమోషన్ పొందాలన్నా పై అర్హతలుండాలి. పీడీ, లైబ్రేరియన్‌సైతం తమ కోర్సులో నెట్, స్లెట్, పీహెచ్‌డీలను సాధించాల్సిందే.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కాలేజీలు

రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో వివిధ వర్సిటీలకు అనుంబంధంగా 1400 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు పుట్టుకువచ్చాయి. అర్హత కలిగిన అధ్యాపకులు, ఐదు ఎకరాలకు తగ్గకుండా కళాశాల స్థలం, అన్ని రకాల ప్రయోగశాలలు, గ్రంథాలయం ఉంటేనే డిగ్రీ కళాశాలకు అనుమతిని ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే 90% ప్రైవేటు కాలేజీలకు ఇవేవీ ఉండవు. ఒకటి, రెండు కాలేజీల్లో తప్ప, ఎక్కడా నెట్, స్లెట్, పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు లేరు. ఇలాంటి 1400 ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ఏటా ఫీజు కింద వేల కోట్లను చెల్లిస్తున్నది.

జగిత్యాల ఉదాహరణ..

జగిత్యాలను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ విశాలమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినాపట్టణంలో ఉన్న ఆరు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న ఆరువేల మంది విద్యార్థులకు (ఒకొక్క విద్యార్థికి ఏటా రూ.పదివేల ఫీజు) రూ.6 కోట్లు ఏటా చెల్లిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం 400మంది విద్యార్థులు కూడా లేకుండా పోయారు. ఎలాగూ రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా అని పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరితే రూ.500లను వర్సిటీకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ప్రైవేట్ కాలేజీల్లో చేరితే ఒక్కరూపాయి తగలకపోగా, కాలేజీ నిర్వహకులే ఏడాదికి రెండు నుండి నాలుగు వేలు విద్యార్థులకు ఎదురు చెల్లిస్తున్నారు. సెల్‌ఫోన్ గిఫ్టుగా ఇస్తున్నారు. మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుండడంతో కాలేజీ యాజమాన్యాలకు వచ్చిన లాభాల మహిమ అది.

లాభసాటి వ్యాపారం..

గత ప్రభుత్వం అనాలోచితంగా డిగ్రీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే తప్పుడు నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు లేకుండా పోయారని అధ్యాపకులు, విద్యావేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉన్న ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు రీయింబర్స్‌మెంట్ అంటే అర్థం ఉందిగాని, సాధారణ డిగ్రీ కోర్సులకు ఎందుకు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. నూతన రాష్ట్రంలోనైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ పథకం స్థానంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఫాస్ట్ పథకంలోనైనా నిబంధనలు మార్చాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి