గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 25, 2014

వలసపాలకుల హయాంలో దారితప్పిన జలం!


-కనుమరుగవుతున్న గొలుసుకట్టు చెరువులు
-మరమ్మతుల్లేక చెరువులకు చేరని వర్షపు నీరు 
-పనికిరాకుండా పోయిన 80 శాతం చెరువులు 
-పొలాలు తడవక అరిగోస పడుతున్న రైతాంగం
-ఆధునీకరిస్తే వ్యవసాయానికి పూర్వవైభవం

రాష్ట్రంలోనే తక్కువ నీటివనరులున్న జిల్లా రంగారెడ్డి! ఈ జిల్లాలో పెద్ద నదుల్లేవ్! ప్రాజెక్టుల ఊసే లేదు! జిల్లాలో అత్యల్పంగా 9 శాతం మాత్రమే నీటివనరులు ఉన్నాయి. ఉన్నదల్లా మూసీ, ఈసీ వంటి చిన్ననదులే. వాటి కింద గొలుసుకట్టు చెరువులు..కుంటలే. మూసీ, ఈసీ నదిలో పారే నీటిని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల ద్వారా హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. వర్షపునీటిపై ఆధారపడి నిర్మించిన గొలుసుకట్టు చెరువులపైనే జిల్లా రైతాంగం ఆధారపడుతోంది. కానీ నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువుల ఆలనాపాలనా లేక చిన్ననీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 

సీమాంధ్ర పాలకులు అరచేతిలో స్వర్గం చూపి అభివృద్ధి ముసుగులో నగర శివార్లలో సొంతలాభం కోసం నెలకొల్పిన పరిశ్రమలు, సెజ్‍ల వల్ల భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ క్రమలో పేరెన్నికగల వందలాది చెరువులు, కుంటలు కబ్జాకు గురై కనుమరుగయ్యా యి. శిఖం భూముల కబ్జాలు..వరదకాలువలు పూడుకుపోవడంతో దాదాపు 80 శాతం చెరువుల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది చెరువులు, కుంటలు కబ్జాకు గురై ఉనికి కోల్పోయాయి. మరోవైపు...ఉన్న చెరువులు సీమాంధ్రుల పాలనలో మరమ్మతులకు నోచుకోక నోళ్లు వెళ్లబెట్టడంతో, అన్నదాతలు సాగు మరిచిపోయి, పక్కనే ఉన్న పట్నంలో కూలిపనులకు వెళ్తున్నారు.

చెరువుల ఖిల్లా..అయినా సాగునీరు కొరతే
జిల్లాలో 5 వేల చెరువులు, 255 కుంటలున్నాయి. వీటిలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 271 చెరువులు, పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 2344 చెరువులున్నాయి. వీటి కింద మొత్తం 2.8 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన చిన్ననీటి వనరులు.. ఇబ్రహీపట్నం పెద్దచెరువు, మహేశ్వరం మండలం కొంగర రావిర్యాల చెరువు, శామీర్‌పేట్ పెద్దచెరువు, బషీరాబాద్ మండలం మైల్వార్ అక్కాలమ్మ చెరువు.. ఇలా ప్రతి మండలంలో ఎన్నో చెరువులున్నాయి. ఒక్కో చెరువుకింద గరిష్ఠంగా 1500 ఎకరాల నుంచి కనిష్ఠంగా 100 ఎకరాల వరకు ఆయకట్టు సాగయ్యేది. 

మొత్తం 1.97 లక్షల ఎకరాలకు సాగునీరుందుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి లక్ష ఎకరాలకు(7 శాతం) మాత్రమే సాగునీటి లభ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రాజెక్టుల విషయానికొస్తే.. జిల్లాలో కోట్‌పల్లి, జుంటుంపల్లి, లఖ్నాపూర్. సాలార్‌నగర్, సర్పన్‌పల్లి, నందివాగు ప్రాజెక్టు, మధ్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 270 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. జిల్లాలో అతి ముఖ్యమైన కోట్‌పల్లి మధ్యతరహా ప్రాజెక్టు కింద 9500 ఎకరాల ఆయకట్టు ఉంది. జుంటుంపల్లి ప్రాజెక్టు కింద 2000 ఎకరాలు, లఖ్నాపూర్‌ప్రాజెక్టు కింద 2600 ఎకరాల ఆయకట్టుంది. 

మరమ్మతులపై అంతులేని నిర్లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు పంటలకు నీరందిస్తున్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధికోసం గత పాలకులు నిధులు కేటాయించలేదు. ఇక చెరువుల సంగతి చెప్పనక్కర్లేదు. కనీస మరమ్మతులకు నోచుకోక చిన్ననీటివనరులు దిక్కులేనివయ్యాయి. వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఒక చెరువు అలుగునిండి మరో చెరువుకు నీరు చేరేలా వర్షపునీరు వృథా కాకుండా నిజాం రాజులు దూరదృష్టితో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. అరకొర నిధులు, తూతూ మంత్రపు పనులతో సీమాంధ్ర పాలకులు సరిపెట్టారు. దీనికితోడు కాంట్రాక్టర్ల అక్రమాలు, అధికారుల అవినీతి వల్ల చిన్ననీటివనరుల అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడింది. దీంతో వేలాది ఎకరాలకు నీరందించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు ఎందుకూ పనికిరాకుండాపోతున్నాయి. వర్షాకాలంలో కొద్దిపాటి నీటితో కళకళలాడినా..ఎండాకాలంలో ఎండిపోతున్నాయి. 

గొలుసుకట్టు చెరువుల నిర్మాణంలో కీలకమైన వరద కాలువలు, ఫీడర్ ఛానెల్స్‌కు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలావరకు ఉనికి కోల్పోయాయి. దీంతో వరదనీరు ఒక్కో చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లే పరిస్థితి లేకుండా దారులు మూసుకుపోయాయి. వరదనీరు చెరువుల్లోకి కాకుండా జనావాసాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో కొద్దిపాటి నీరుచేరినా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. దీంతో రైతాంగానికి వర్షాధార(మెట్ట) పంటలు, బోరుబావుల కింద కూరగాయ తోటలే దిక్కయ్యాయి. 

ఇలా చేస్తే సాగునీటి కష్టాలకు పరిష్కారం
పెద్దేముల్ మండలం కోట్‌పల్లి మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కింద 9500 ఆయకట్టు ఉంది. జైకా నిధులతో మరమ్మతులు చేపడతామని చెబుతున్నా పనులు ముందుకు సాగడంలేదు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే లక్ష్యం నెరవేరుతుంది. తాండూర్ నియోజకవర్గంలోని జుంటుపల్లి ఉద్దండరావు చెరువు కింద 386 ఎకరాల ఆయకట్టుంది. సీబీటీ కింద రూ.25 లక్షలు మూడేళ్ల క్రితం మంజూరవగా రూ.10 లక్షలతో మట్టిపనులు చేసి వదిలేశారు. పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు కింద 2,600 ఎకరాలు, గండీడ్ మండలంలోని సాలార్‌నగర్ ప్రాజెక్టు కింద 1,300 ఎకరాలు సాగవ్వాలంటే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. బషీరాబాద్ మండలం మైల్వార్ అక్కాలమ్మ చెరువును ప్రాజెక్టుగా మార్చితే 550 ఎకరాలకు నీరందుతుంది. 

కాశీంపూర్ పంచాయతీ బహద్దూర్‌పూర్ పీరోని చెరువును కూడా ప్రాజెక్టుగా మార్చితే వెయ్యి ఎకరాలకు నీరందుతుంది. పెద్దేముల్ మండలం నాగులపల్లి, బంట్వారం మండలం రొంపల్లి మధ్య రూ.3 కోట్ల అంచనాతో 494 ఎకరాలు ఆయకట్టుకు నీరందించాలని కొత్తగా మల్కదాన్ నిర్మించాలని ప్రతిపాదించారు. నిధులు మంజూరై మూడేళ్లు గడిచినా స్థలసేకరణ సమస్యతో పనులు జరగడం లేదు. ఇందూర్ సమీపంలో రూ.కోటి వ్యయంతో అస్తవ్యస్తంగా చెరువు నిర్మించడంతో వృథాగా మిగిలింది. తాండూరు మండలం చెంగోల్ వద్ద అల్లాపూర్ చెరువును ప్రాజెక్ట్‌గా మార్చితే 300 ఎకరాలకు నీరందించవచ్చు. శామీర్‌పేట పెద్దచెరువు 300 ఎకరాలకు సాగునీరిస్తోంది. అభివృద్ధి చేస్తే 1200 ఎకరాలకు నీరందుతుంది. వికారాబాద్ నియోజకవర్గంలో సర్పన్‌పల్లి ప్రాజెక్టు కింద 4600 ఆయకట్టుంది. ప్రస్తుతం 1000 ఎకరాలకూ నీరందడం లేదు. 

కొంపల్లి చెరువు, కామారెడ్డిగూడ, మద్గుల్‌చిట్టంపల్లి చెరువు, మోమిన్‌పేట్ మండలం మల్‌రెడ్డిగూడెం, ఎన్కతలలోని చిన్న చెరువు, పెద్ద చెరువు, నందివాగు ప్రాజెక్టు, అయిమ చెరువుల కింద 3062 ఎకరాల ఆయకట్టుంది. ప్రస్తుతం 1000 ఎకరాలకు కూడా నీరందడంలేదు. మర్పల్లి మండలంలోని చెరువుల కింద 3757ఆయకట్టుండగా,1000 ఎకరాలకే నీరందుతోంది. బంట్వారం మండలంలోని చెరువుల కింద 890 ఆయకట్టు ఉంటే 150 ఎకరాలకే నీరందుతోంది. ధారూరు మండలం లో చెరువుల కిందట 2,832 ఎకరాల ఆయకట్టు ఉంటే, 600 ఎకరాలకు నీరందుతుంది. మహేశ్వరం మండలం రావిర్యాలలో 240 ఎకరాలు, కొంగరకుర్ధులో 750 ఎకరాలు, ఇబ్రహీంపట్నం ఆదిభట్లలో 1200 ఎకరాలు సాగునీరందేది. ప్రస్తుతం ఈ చెరువులో చుక్కనీరు లేదు. బాగుచేస్తే చుట్టుపక్కల 7 గ్రామాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి తక్షణమే ఈ కాలువలను ఆధునీకరిస్తే చివరి పొలాలకు నీరు చేరుతుంది. మన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం చేకూరుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి